Friday, March 6, 2015

Yadagirigutta is now called as Yadaadri


యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని తొమ్మిది కొండలవాడుగా భక్తులకు చేరువ చేసేందుకు భారీ ప్రతిపాదన సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగానే యాదగిరిగుట్టకు యాదాద్రిగా చారిత్రక నామాన్ని జీయర్‌స్వామి ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించారు. గుట్ట చుట్టుపక్కల ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఏడు గుట్టలున్నాయి. ప్రైవేటు అధీనంలో మరో రెండుమూడున్నాయి. దీంతో మొత్తంగా తొమ్మిది గుట్టలను ఈ క్షేత్రం పరిధిలోకి తెచ్చి నవగిరులుగా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. వాటికి కూడా నామకరణం చేయాల్సిందిగా జీయర్‌స్వామిని కోరారు. భక్తులు వెళ్లడానికి వీలుగా వీటన్నింటినీ అనుసంధానిస్తూ భవిష్యత్తులో మోనో రైలు ఏర్పాటు ఆలోచన కూడా ఉందని కేసీఆర్ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ల క్ష్మీనరసింహస్వామి ఆలయాల లెక్క తీయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాథమికంగా 32 ఆలయాలున్నట్టు తేల్చారు. ఆ రూపాలను యాదగిరి గుట్టలో ప్రతిష్టించాలని సూచించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట మార్గాలను అద్భుతంగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.

Source: http://www.greattelengana.com/yadagiri-turns-as-yadaadri/

No comments:

Post a Comment